Total Pageviews

Monday, January 19, 2026

శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రము

 శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రము   (ప్రతిపదార్థం, తాత్పర్యములతో) – ఆచార్య తాడేపల్లి పతంజలి 14 -06 -25 రచన.

 

శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రము( రామకృష్ణ కవి రచన)

శ్లోకము 1

అయి గిరినందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని, నంది నుతే!

గిరివర వింధ్యశిరోధి నివాసిని, విష్ణు విలాసిని, జిష్ణు నుతే!

భగవతి! హే శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని, భూరికృతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి గిరినందిని: ఓ పర్వతరాజు కుమార్తె!
  • నందిత మేదిని: భూమిని సంతోషపెట్టినదానా,
  • విశ్వ వినోదిని: లోకానికి ఆనందాన్ని కలిగించేదానా,
  • నంది సుతే: నందిచే స్తుతించబడినదానా,
  • గిరివర వింధ్య శిరోధి నివాసిని: గొప్ప పర్వతమైన వింధ్య పర్వతం శిఖరంపై నివసించేదానా,
  • విష్ణు విలాసిని: అంతటా వ్యాపించిన లీలలు గలదానా,
  • జిష్ణునుతే: ఇంద్రునిచే పొగడబడినదానా,
  • భగవతి: అద్భుత శక్తులు, ఐశ్వర్యం, జ్ఞానం నిండినదానా,
  • హే శితికంఠ కుటుంబిని: ఓ శివుని ఇల్లాలా,
  • భూరి కుటుంబిని: పరబ్రహ్మకు పట్టమహిషివి,
  • భూరికృతే: పరబ్రహ్మాన్ని చేర్చేదానా,
  • శైలసుతే: ఓ పర్వతరాజు కూతురా,
  • రమ్య కపర్దిని: అందమైన జడలు కలదానా,
  • హే మహిషాసురమర్దిని: ఓ మహిషాసురుడిని సంహరించిన తల్లీ!
  • జయ జయ: నీకు విజయం కలుగుగాక!

తాత్పర్యము:

ఓ పర్వతరాజు కూతురా! నీవు భూమిని ఆనందింపజేసేదానివి, లోకానికి సంతోషాన్ని కలిగించేదానివి. నంది నిన్ను స్తుతిస్తాడు. వింధ్య పర్వతంపై నివసించే నీ లీలలు అన్నీ వ్యాపించాయి. ఇంద్రుడు కూడా నిన్ను పొగుడుతాడు. నీవు సకల శక్తులు, ఐశ్వర్యం, జ్ఞానం నిండిన దైవానివి. శివుని ఇల్లాలివి, పరబ్రహ్మానికి పట్టమహిషివి, పరమాత్మను పొందేలా చేసేదానివి. ఓ అందమైన జడలు గల పార్వతీదేవి! మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లి! నీకు విజయం కలుగుగాక!


శ్లోకము 2

సురవర వర్షిణి, దుర్దర ధర్షిణి, దుర్ముఖ మర్షిణి, హర్షరతే!

త్రిభువన పోషిణి, శంకర తోషిణి, కిల్బిషమోషిణి, ఘోరరతే!

దను-జని-రోషిణి, దుర్మద శోషిణి, దుఃఖ వినాశిని, సింధుసుతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • సురవర వర్షిణి: దేవతలకు మంచి వరాలను ఇచ్చేదానా,
  • దుర్దర ధర్షిణి: ఓడించలేని దుర్మార్గులకు భయాన్ని కలిగించేదానా,
  • దుర్ముఖ మర్షిణి: చెడ్డవారిని సహించేదానా (ఎదుర్కోగలదానా),
  • హర్షరతే: సంతోషంలో ఆనందించేదానా (ఆనంద స్వరూపమైనదానా),
  • త్రిభువన పోషిణి: మూడు లోకాలను పోషించేదానా,
  • శంకర తోషిణి: శివుడిని సంతోషపెట్టేదానా,
  • కిల్బిషమోషిణి: పాపాలను నాశనం చేసేదానా,
  • ఘోరరతే: భయంకరమైన పనులను (దుష్టులకు) చేయడంలో ఆసక్తి గలదానా,
  • దను-జని-రోషిణి: రాక్షసుల పట్ల కోపం గలదానా,
  • దుర్మద శోషిణి: అహంకారంతో ఉన్నవారిని నాశనం చేసేదానా,
  • దుఃఖ వినాశిని: దుఃఖాలను దూరం చేసేదానా,
  • సింధుసుతే: సముద్రుని కుమార్తె (సాగర కన్యకా)!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!

తాత్పర్యము:

ఓ దేవీ! నీవు దేవతలకు మంచి వరాలను ప్రసాదిస్తావు. దుర్మార్గులకు భయాన్ని కలిగించి, వారిని సహించి (అదుపు చేసి) ఎదుర్కోగలవు. నీవు ఆనంద స్వరూపిణివి, ఎప్పుడూ సంతోషంలో ఉంటావు. మూడు లోకాలను పోషిస్తూ, శివుడిని సంతోషపెడతావు. పాపాలను హరిస్తూ, దుష్టులకు భయం కలిగించే పనులను చేస్తావు. రాక్షసుల పట్ల కోపంతో, అహంకారులను నాశనం చేస్తావు. దుఃఖాలను దూరం చేసే ఓ సముద్రుని కుమార్తె, పర్వతరాజు బిడ్డా! అందమైన జడలున్న మహిషాసురమర్దిని! నీకు ఎల్లప్పుడూ జయం కలుగుగాక!


శ్లోకము 3

అయి జగదంబ మదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే!

శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే!

మధు మధురే! మధు కైతవ భంజని కైటభగంజిని రాసరతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి జగదంబ: ఓ జగత్తుకు తల్లీ!
  • మదంబ: ఓ నా అమ్మా!
  • కదంబవన ప్రియవాసిని: కడిమి వనం (కదంబ చెట్ల తోట) ఇష్టమైన నివాసంగా కలదానా,
  • హాసరతే: ఎప్పుడూ ఆనందంగా ఉండేదానా,
  • శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే: పర్వతాలకు రాజు, ఎత్తైన హిమాలయ పర్వత శిఖరమే తన ఇల్లుగా, దాని మధ్యలో ఉండేదానా,
  • మధు మధురే: తేనెలా మధురమైనదానా (లేదా అందరి ఆత్మగా నిలిచి అందరికీ ఇష్టమైనదానా),
  • మధు కైతవ భంజని: మధు అనే రాక్షసుడి మోసాన్ని నాశనం చేసినదానా,
  • కైటభగంజిని: కైటభ అనే రాక్షసుడిని హాహాకారాలు పెట్టించినదానా,
  • రాసరతే: రసం (పరమాత్మ) లో లీనమైనదానా,
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

ఓ జగజ్జననీ, నా ప్రియమైన అమ్మా! నీవు కడిమి వనాల్లో ఇష్టంగా నివసించేదానివి, ఎప్పుడూ ఆనందంగా ఉండేదానివి. పర్వతాలన్నింటికీ శిరోమణి అయిన ఎత్తైన హిమాలయ శిఖరమే నీ నివాసం. నీవు తేనెలా మధురమైన దానివి, లేదా అందరిలో ఆత్మగా ఉండి అందరికీ ప్రియమైన దానివి. మధు అనే రాక్షసుడి మోసాన్ని నాశనం చేసి, కైటభుడిని భయపెట్టి హాహాకారాలు చేయించావు. పరమాత్మ స్వరూపిణివి, ఆయనలో లీనమైన దానివి. అందమైన జడలున్న, మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజు కుమార్తె! నీకు ఎప్పుడూ విజయం కలుగుగాక!


శ్లోకము 4

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే!

రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ - మృగాధిపతే!

నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి: ఓ,
  • శతఖండ విఖండిత రుండ: వంద ముక్కలుగా నరకబడిన మొండెం గలదానా,
  • వితుండిత శుండ గజాధిపతే: తెగిన తొండం గల గజాసురుడిని సంహరించినదానా,
  • రిపు గజ గండ విదారణ: శత్రువులైన ఏనుగుల చెక్కిళ్లను చీల్చడంలో,
  • చండ పరాక్రమ శౌండ: చాలా భయంకరమైన పరాక్రమంలో నేర్పరి అయిన,
  • మృగాధిపతే: సింహరాజును వాహనంగా గలదానా (లేదా సింహపరాక్రమం గలదానా),
  • నిజ భుజ దండ నిపాతిత: తన చేతులతో పడగొట్టబడిన,
  • చండ నిపాతిత ముండ: చండుడు, ముండుడు అనే సేనాధిపతులను నాశనం చేసినదానా,
  • భటాధిపతే: సైన్యాధిపతులు గలదానా,
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

ఓ దేవీ! నీవు గజాసురుడిని నూరు ముక్కలుగా నరికి, అతని తొండాన్ని ఖండించి సంహరించావు. నీ సింహం శత్రువుల ఏనుగుల చెక్కిళ్లను చీల్చడంలో గొప్ప పరాక్రమం గలది. నీవు నీ చేతులతో చండుడు, ముండుడు అనే సైన్యాధిపతులను నేలకూల్చావు. అందమైన జడలున్న, మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజు కుమార్తె! నీకు ఎప్పుడూ విజయం కలుగుగాక!


శ్లోకము 5

అయి రణ దుర్మద శత్రు వధోచిత దుర్ధర నిర్జరశక్తి భృతే!

చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధి పతే!

దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత కృతాంతమతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి: ఓ,
  • రణ దుర్మద శత్రు వధోచిత: యుద్ధంలో అహంకారంతో ఉన్న శత్రువులను సంహరించడానికి తగిన,
  • దుర్ధర నిర్జరశక్తి భృతే: ఎదుర్కోలేని దేవతల శక్తులను (బ్రాహ్మీ, మాహేశ్వరి వంటివి) తనలో నింపుకున్నదానా,
  • చతుర విచార ధురీణ: గొప్ప ఆలోచనా శక్తి కలిగిన,
  • మహాశివ దూతకృత: మహాశివుడిని దూతగా చేసుకున్న,
  • ప్రమథాధి పతే: ప్రమథ గణాలకు అధిపతి అయినదానా,
  • దురిత దురీహ దురాశయ దుర్మద: చెడు కోరికలు, చెడు ఆలోచనలు, మితిమీరిన అహంకారం గల,
  • దానవ దూత: శుంభనిశుంభాసురుల దూతను,
  • కృతాంతమతే: అంతం చేయాలనే బుద్ధి (నిర్ణయం)తో ఉన్న తల్లీ!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

ఓ దేవీ! నీవు యుద్ధంలో అహంకారంతో ఉన్న శత్రువులను అంతం చేయడానికి సిద్ధంగా ఉంటావు. నిన్ను ఎదుర్కోలేని దేవతల శక్తులన్నీ నీలోనే ఉన్నాయి. చక్కటి ఆలోచనా శక్తి గల నీవు, మహాశివుడిని దూతగా పంపి, ప్రమథ గణాలకు అధిపతిగా ఉన్నావు. చెడు కోరికలు, దురాలోచనలు, అహంకారంతో నిండిన శుంభనిశుంభుల దూతను అంతం చేయాలని నిర్ణయించుకున్నావు. అందమైన జడలున్న, మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజు కుమార్తె! నీకు ఎప్పుడూ విజయం కలుగుగాక!


 

శ్లోకము 6

అయి శరణాగత వైరివధూ వరవీర వరాభయ దాయకరే!

త్రిభువన మస్తక శూల విరోధిశిరోధికృతామల శూలకరే!

దుమి దుమితామరదుందుభినాద ముహుర్ముఖరీకృత శంఖకరే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి: ఓ,
  • శరణాగత వైరివధూ: శరణు కోరిన శత్రువుల భార్యలకు,
  • వరవీర వరాభయ దాయకరే: వారి వీరులైన భర్తలకు వరాన్ని, అభయాన్ని ఇచ్చే చేతులు గలదానా!
  • త్రిభువన మస్తక శూల: మూడు లోకాలకు తలనొప్పిగా మారిన,
  • విరోధిశిరోధికృత అమల శూలకరే: శత్రువుల తలలపై ఎత్తబడిన నిర్మలమైన శూలాన్ని చేతిలో ధరించినదానా!
  • దుమి దుమితామరదుందుభినాద: 'దుం దుం' అని మ్రోగే దేవతా దుందుభుల శబ్దాలతో,
  • ముహుర్ముఖరీకృత శంఖకరే: మాటిమాటికీ ధ్వనించే శంఖాన్ని చేతిలో పట్టినదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

ఓ పర్వతరాజు కుమార్తె! నీ శిరస్సుపై అందమైన జటలు శోభిల్లుతున్నాయి. మహిషాసురుడిని సంహరించిన ఓ మహాలక్ష్మీ! తల్లీ! శత్రు వీరుల భార్యలు నిన్ను శరణు వేడితే, వారి వీరులైన భర్తలను యుద్ధంలో చంపడమే కాదు, వారికి ఒక చేత్తో వరాలను, మరొక చేత్తో అభయాన్ని కూడా ఇస్తావు. అమ్మా! మూడు లోకాలకు తలనొప్పిగా మారిన రాక్షసులను నాశనం చేయడానికి, వారి తలలపై ఎత్తబడిన శూలం నీ మరో చేతిలో మెరుస్తూ ఉంటుంది. దేవతా దుందుభులు 'దుం దుం' అని మ్రోగుతుండగా, మాటిమాటికీ ధ్వనించే శంఖాన్ని నీ ఇంకొక చేతిలో ధరించి ప్రకాశిస్తుంటావు. ఓ జననీ! నీకు ఎల్లప్పుడూ జయం కలుగుగాక!


శ్లోకము 7

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశిఖే!

సమర విశోషిత శోణితబీజ సముద్భవ శోణితబీజ లతే!

శివ శివ! శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూతపిశాచరతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

  • అయి: ఓ,
  • నిజ హుంకృతి మాత్ర: నీ కేవలం హుంకారంతో,
  • నిరాకృత ధూమ్రవిలోచన: ధూమ్రాక్షుడు అనే పొగతో నిండిన అగ్నిజ్వాల వంటి రాక్షసుడిని నాశనం చేసినదానా!
  • సమర విశోషిత: యుద్ధంలో పూర్తిగా ఎండిపోయేలా చేసిన,
  • శోణితబీజ సముద్భవ: నెత్తురు చుక్కల నుండి పుట్టిన,
  • శోణితబీజ లతే: రక్తబీజుల పరంపర అనే తీగను (సంతతిని) నాశనం చేసినదానా,
  • శివ శివ! (ఆశ్చర్యసూచకం)
  • శుంభ నిశుంభ మహాహవ: శుంభ, నిశుంభులతో జరిగిన గొప్ప యుద్ధంలో,
  • తర్పిత భూతపిశాచరతే: తృప్తిపరచబడిన భూతాలు, పిశాచాల పట్ల ఆనందించినదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

అందమైన జడలతో ప్రకాశించే ఓ పర్వతరాజు కుమార్తె! మహిషాసురుడిని అంతం చేసిన తల్లీ! శుంభ నిశుంభులు పంపిన ధూమ్రాక్షుడు పొగలు కక్కుతూ అగ్నిజ్వాలలా నీపైకి దూకగా, నీవు కేవలం నీ హుంకారంతోనే అతడిని కాల్చి బూడిద చేశావు. అమ్మా! రక్తబీజుడు అనే రాక్షసుడికి ఒక వరం ఉంది - అతని నెత్తురు చుక్కలు నేలపడితే, వాటి నుండి మరెన్నో రక్తబీజులు పుడతారు. అలాంటి రక్తబీజుడు నిన్ను చుట్టుముట్టగా, అతని నెత్తురు నేలపై పడకముందే ఎండిపోయేలా చేసి, రక్తబీజుల వంశాన్ని అంతం చేసిన సమర్థురాలవు. శుంభ నిశుంభులతో జరిగిన భయంకరమైన యుద్ధంలో నీవు చంపిన రాక్షసుల మాంసాన్ని, రక్తాన్ని కడుపునిండా తిని తృప్తి చెందిన భూత పిశాచ గణాలను చూసి నీవు ఆనందించావు. తల్లీ! నీ యుద్ధం చాలా అద్భుతమైనది. అంబా! నీకు ఎల్లప్పుడూ జయం కలుగుగాక!


శ్లోకము 8

దనుజ సుసంగర రక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే!

కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భటశృంగ హతా వటుకే!

కృత చతురంగబల క్షితిరంగ ఘటద్బహురంగ రట ద్వటుకే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

  • దనుజ సుసంగర: రాక్షసులతో జరిగిన గొప్ప యుద్ధంలో,
  • రక్షణ సంగ: రక్షించే పనిలో నిమగ్నమై,
  • పరిస్ఫురదంగ: ఎక్కువగా కదులుతున్న అవయవాలపై (చేతులపై),
  • నటత్కటకే: కదలాడుతున్న కంకణాలు గలదానా,
  • కనక పిశంగ: బంగారు రంగులో మెరుస్తున్న,
  • పృషత్క నిషంగ: బాణాల సమూహంతో,
  • రసద్భటశృంగ: గొప్ప వీరుల (కొండ కొమ్ముల వంటి) తలలను,
  • హతా వటుకే: నరకబడిన పెడతలలు గలవారిగా చేసినదానా,
  • కృత చతురంగబల: ఏర్పరచిన నాలుగు రకాల సేనలతో (రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిబలం),
  • క్షితిరంగ: యుద్ధభూమిలో,
  • ఘటద్బహురంగ: అనేక యుద్ధ వేదికలను సిద్ధం చేస్తూ,
  • రట ద్వటుకే: కోలాహలం చేస్తున్న వటుక గణములు (దేవతలు) గలదానా,
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ, నీకు జయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన జడలు కలదానా,
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె!

తాత్పర్యము:

కపర్దం (జటాజూటం) తో ప్రకాశించే ఓ పర్వతరాజు కుమార్తె! దుర్మార్గుడైన మహిషాసురుడిని అంతం చేసిన ఓ మహాదేవి! నీవు రాక్షసులతో చేసిన యుద్ధం ఆశ్చర్యకరమైనది. రక్షించే పనిలో నిమగ్నమై, ఎప్పుడూ కదులుతున్న నీ చేతులపై కంకణాలు ఆడుతూ ఉంటాయి. నీకు జయం కలుగుగాక! బంగారు రంగులో మెరుస్తున్న నీ బాణాల తాకిడికి తట్టుకోలేక, చెల్లాచెదురైన శత్రువీరుల తలలను బాణాలతో వేగంగా నరికిన నీ యుద్ధ నైపుణ్యానికి జయము! జయము! రాక్షసులతో జరిగిన యుద్ధంలో, నీ చతురంగ బలగాలతో ఏర్పడిన అనేక యుద్ధభూములలో, నీ వటుక గణములు యుద్ధోత్సాహంతో చేసిన కోలాహలం అద్భుతమైనది. సాటిలేని పరాక్రమం గల ఓ అంబా! నీకు ఎప్పుడూ వేలవేల విజయాలు కలుగుగాక!

 

శ్లోకము 9

జయజయ! జప్యజయే! జయశబ్దపర స్తుతి తత్పర విశ్వనుతే!

ఝణఝణ ఝింఝిం ఝింకృత నూపుర శింజిత మోహిత భూతపతే!

నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్యను గానరతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతిపదార్థము:

ప్రతి పదార్థ వివరణ

  • జప్యజయే: ఎప్పుడూ జపించదగిన విజయ గాథలు గల తల్లీ!
  • జయశబ్దపర స్తుతి తత్పర: "జయ" అనే శబ్దంతో కూడిన స్తోత్రాలను ఇష్టపడేదానా!
  • విశ్వనుతే: ఈ లోకంలో అందరిచేత కీర్తించబడే జననీ!
  • జయజయ: నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • ఝణఝణ ఝింఝిం ఝింకృత నూపుర శింజిత: ఝణఝణ ఝింఝిం అని మోగే నీ కాలి అందెల మధుర ధ్వనులతో
  • మోహిత భూతపతే: శివుడిని కూడా పరవశుడిని చేసేదానా!
  • నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్యను గానరతే: నాట్యం చేసే నటీనటులకు అధిపతి అయిన నటరాజు (శివుడు) నాట్యం చేస్తున్నప్పుడు, నాట రాగంతో కూడిన అనుకూల గానాన్ని ఇష్టపడేదానా! (అంటే, శివుని నాట్యానికి తగినట్లుగా నువ్వు పాడుతావు.)
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అందమైన జటాజూటంతో ప్రకాశించే ఓ పర్వతరాజ పుత్రీ! మహిషాసురుడనే గొప్ప రాక్షసుడిని సులభంగా సంహరించి నేలకూల్చిన జగదంబికా!

నీ విజయ గాథలైన మధుకైటభ వధ, మహిషాసుర వధ, శుంభ నిశుంభ వధ అనే మూడు చరిత్రలు జపించడానికి చాలా ముఖ్యమైనవి. అంబిక అనుగ్రహాన్ని కోరుకునేవారు ఈ గాథలను ప్రతిరోజూ జపించాలి.

నువ్వు "జయ జయ" అనే పదాలతో ముగిసే స్తోత్రాలను వినడానికి చాలా ఆనందిస్తావు. అందరిచేతా కీర్తించబడే ఓ జగన్మాతా! నీకు ఎల్లప్పుడూ విజయం కలుగుగాక!

అమ్మా! నీ కాలి అందెలు "ఝణ ఝణ ఝిం ఝుమి ఝుం" అంటూ ఎంతో మధురంగా ధ్వనిస్తూ, శివుడిని కూడా పరవశుడిని చేస్తాయి. నాట్య కళలో నిష్ణాతులైన నటీనటులందరికీ నాయకుడైన నటరాజు (శివుడు) నాట్యం చేస్తున్నప్పుడు, నువ్వు నాటి రాగంతో తగిన పాటను పాడుతూ ఆయన నాట్యానికి తోడుంటావు.

ఓ దేవీ! నీకు విజయం కలుగుగాక!


శ్లోకము 10

అయి సుమన స్సుమన స్సుమన స్సుమన స్సుమనోహర కాంతియుతే!

శ్రితరజ నీరజ నీరజనీ రజనీ రజనీకర వక్త్రవృతే!

సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అయి: ఓ తల్లి!
  • సుమన స్సుమన స్సుమన స్సుమనోహర కాంతియుతే: విద్వాంసులకు, దేవతలలోకెల్లా గొప్పవారైన బ్రహ్మాదులకు పువ్వుల వలె ఎంతో మనోహరమైన కాంతితో కనిపించేదానా!
  • శ్రితరజ నీరజ నీరజనీ రజనీ రజనీకర వక్త్రవృతే: రజోగుణం ఉన్నవారికి మేఘాలతో నిండిన చీకటి రాత్రి (కాళరాత్రి) వలె భయంకరంగా, రజోగుణం లేనివారికి (సత్వగుణవంతులకు) నిండు చంద్రుడి వంటి ప్రకాశవంతమైన ముఖంతో కనిపించేదానా!
  • సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే: అందమైన కన్నుల విలాసాలు తుమ్మెదల వలె కదలాడుతుండగా, వాటిపై (నల్లని) గండు తుమ్మెదలు తిరుగుతున్నాయా అన్నట్లు ఉండేదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అందమైన జటాజూటంతో మెరిసే ఓ పర్వతరాజు కుమార్తె! మహిషాసురుడిని చంపిన ఓ దేవీ! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! ఆత్మజ్ఞానం కలిగిన పండితులకు, దేవతలలోకెల్లా అధిపతులైన బ్రహ్మాదులకు నువ్వు పూల వలె చాలా అందమైన కాంతితో కనిపిస్తావు. దుర్మార్గులకు మాత్రం యముడి వలె భయంకరంగా కనిపిస్తావు.

అమ్మా! రజోగుణం (చెడు లక్షణాలు) ఉన్నవారికి నీ ముఖం మేఘాలతో నిండిన చీకటి రాత్రి వలె చాలా భయంకరంగా కనిపిస్తుంది. కానీ, సత్వగుణం (మంచి లక్షణాలు) ఉన్నవారికి మాత్రం పౌర్ణమి నాటి నిండు చంద్రుడి వలె ప్రకాశవంతంగా, శాంతంగా కనిపిస్తుంది. ఓ జననీ! నీకు విజయం కలుగుగాక!

మహాదేవీ! నీ అందమైన కళ్ళ కదలికలు (చూపులు) తుమ్మెదల వలె చంచలంగా ఉంటాయి. ఆ కళ్ళ చూపులను చూసి, నిజమైన గండు తుమ్మెదలు కూడా తమ తోటి తుమ్మెదలే అనుకుని వాటిపై తిరుగుతున్నాయి. దుష్టులను శిక్షించి, మంచివారిని రక్షించే ఓ పరమేశ్వరీ! నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!

(ఇక్కడ కవి దేవి కళ్ళ చూపులను నల్లని తుమ్మెదలతో పోల్చారు. ఆ చూపుల విలాసాలను చూసి నిజమైన గండు తుమ్మెదలు అవి తమ జాతివి అనుకుని భ్రమ పడుతున్నాయని వర్ణించడం జరిగింది.)

 

శ్లోకము 11

కర మురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే!

మిళిత మిళింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజగతే!

మృగగణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేళిభృతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అయి: ఓ తల్లి!
  • కర మురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే: చేతిలోని పిల్లనగ్రోవి (మురళి) శబ్దాలతో, కూయడానికి సిగ్గుపడేలా చేసిన కోకిలల సుకుమారమైన మనస్సు గలదానా! (అంటే, నీ మురళీనాదం కోకిలల కూతల కన్నా మధురమైనది.)
  • మిళిత మిళింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజగతే: గుంపులు గుంపులుగా చేరిన తుమ్మెదల అందమైన ఝంకార శబ్దాలతో మరింత అందంగా మారిన కొండ పొదరిళ్ళలో తిరిగేదానా!
  • మృగగణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేళిభృతే: లేళ్ళుగా మారిన శివుని ప్రమథగణాలు, పెద్ద శబరీ (చెంచెత) గుంపులుగా మారిన భూతగణాలు తమ వేషాలకు తగిన మంచి గుణాలతో ఆటలాడుతుండగా, వాటిని చూసి ఆనందించేదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అందమైన జటాజూటంతో అలంకరించబడిన, మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజు ప్రియపుత్రీ! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! నీ చేతిలోని పిల్లనగ్రోవి నుండి వెలువడే మధురమైన శబ్దాలు విని, కోకిలలు తమ మనస్సులలో చిన్నబోయి, కూయడానికి కూడా సిగ్గుపడుతున్నాయి. పిల్లనగ్రోవిని మధురంగా వాయించడంలో గొప్పదానవైన ఓ తల్లీ! నీకు విజయం కలుగుగాక!

అమ్మా! నువ్వు అనేక తుమ్మెదల ఝంకార శబ్దాలతో అందంగా మారిన కొండ పొదరిళ్ళలో తిరుగుతూ ఉంటావు. అడవులలో ఎప్పుడూ విహరించడానికి ఇష్టపడేదానా! నీకు విజయం కలుగుగాక!

జననీ! శివుడు కిరాతుడి (బోయవాడి) వేషం వేసుకున్నప్పుడు, నువ్వు కూడా ఆయన వెనుక శబరి (చెంచెత) వేషం వేసుకుని తిరిగావు. అప్పుడు శివుని ప్రమథగణాలు లేళ్ళుగా మారగా, భూతగణాలు పెద్ద చెంచెత గుంపులుగా మారాయి. వారు తమ వేషాలకు తగిన గుణాలతో ఆటలాడుతుండగా, నువ్వు వారితో కలిసి ఆనందించి వినోదించావు. తల్లీ! నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!

 

శ్లోకము 12

కమల దళామల కోమల కాంతి కళా కలితాతుల బాలలతే!

సకల కళానిచయ క్రమకేళి చలత్కల హంసకులాళికులే!

అలికుల సంకుల కువలయ మండిత మౌళి మిళధ్వకులాళికులే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకవర్ధిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అయి: ఓ తల్లి!
  • కమలదళ అమల కోమల కాంతి కళా కలిత అతుల బాలలతే: తామరపూల రేకులలోని స్వచ్ఛమైన, మృదువైన కాంతితో మెరిసిపోతూ, సాటిలేని బాలాత్రిపుర సుందరి రూపంలో ఉన్న కల్పలత వలె ఉన్నదానా!
  • సకల కళానిచయ క్రమకేళి చలత్ కలహంసకులాళికులే: అన్ని కళలతో నిండిన, రాజహంసల వలె అందమైన నడకలతో నడిచే సఖీ సమూహాలు గలదానా!
  • అలికుల సంకుల కువలయ మండిత మౌళి మిళధ్వకులాళికులే: తుమ్మెదల గుంపులతో నిండిన కలువ పూలతో అలంకరించబడిన తల గలదానా, మరియు నీ తలను తాకుతున్న పొగడ పూల వరుసలు గలదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

హిమవంతుని కుమార్తెవై, అందమైన జటాజూటంతో మెరిసి, మహిషాసురుడిని సంహరించడంలో సమర్థురాలైన ఓ తల్లీ! నీకు విజయం కలుగుగాక!

నువ్వు ఎర్ర తామరపూల రేకుల వంటి స్వచ్ఛమైన, సున్నితమైన, మనోహరమైన కాంతితో బాలాత్రిపుర సుందరి రూపంలో వెలసిన కల్పలతవు. ఓ జననీ! నీకు విజయం కలుగుగాక! (నువ్వు సూర్యకిరణాల వలె లోకమంతా కాంతిని ప్రసరిస్తూ, శుభాలను అందించేదానా!)

అందచందాలతో నిండిన ఒయ్యారపు నడకలతో రాజహంసల వంటి సఖీ బృందంతో కలిసి తిరిగేదానా! నీకు విజయం కలుగుగాక!

అమ్మా! తుమ్మెదల గుంపులతో నిండిన కలువ పూలను నీ తలలో పెట్టుకుని, పొగడ పూల మధ్య నడుస్తున్నప్పుడు ఆ బొగడ పూలు నీ తలని తాకుతున్నాయి. ఇలా అడవులలో తిరిగే స్వభావం గల ఓ జననీ! నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!


శ్లోకము 13

కటితట పీతదుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే!

ప్రణత సురాసుర మౌళి మణి స్ఫురదంశు లసన్నఖ చంద్రరుచే!

జిత కనకాచల మౌళి పదోర్జిత నిర్జర కుంజర కుంభకుచే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • కటితట పీతదుకూల విచిత్ర మయూఖ: నడుము భాగంలో ఉన్న పసుపు పట్టుచీర యొక్క అద్భుతమైన కాంతులతో
  • తిరస్కృత చంద్రరుచే: చంద్రుని కాంతిని కూడా తక్కువ చేసేదానా!
  • ప్రణత సురాసుర మౌళి మణి స్ఫురదంశు లసన్నఖ చంద్రరుచే: వంగి నమస్కరించే దేవతలు, రాక్షసుల కిరీటాలలోని రత్నాల నుండి వెలువడే కిరణాలతో ప్రకాశించే, చంద్రవంకల వంటి కాలిగోళ్ళ కాంతి గలదానా!
  • జిత కనకాచల మౌళి పద: బంగారు పర్వతం (మేరు పర్వతం) శిఖరాన్ని మించిన
  • ఊర్జిత నిర్జర కుంజర కుంభకుచే: గొప్పవైన దేవతల ఏనుగు (ఐరావతం) కుంభస్థలాలను మించిన వక్షోజాలు (రొమ్ములు) గలదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

పర్వతరాజు కుమార్తె! మహిషాసురుడి ప్రాణాలను తీసిన మహాదేవీ! అందమైన జటాజూటంతో మెరిసే ఓ తల్లీ! నీకు విజయం కలుగుగాక!

అమ్మా! నువ్వు ధరించిన పసుపు రంగు పట్టుచీర నీ నడుము భాగంలో అద్భుతమైన కాంతులతో మెరుస్తుండగా, దాని ముందు చంద్రుని కాంతి కూడా వెలవెలబోతోంది. ఇలా పసుపు పట్టుచీరతో మెరిసిపోతున్న నడుము గలదానా! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! దేవతలు, రాక్షసులు తలలు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు, చంద్రవంకల వంటి నీ కాలిగోళ్ళు వారి కిరీటాలలోని రత్నాల కాంతులతో మరింత ప్రకాశిస్తున్నాయి. అమ్మా! నీ పాద పద్మాలకు విజయం కలుగుగాక!

జగన్మాతా! నీ వక్షోజాలు (రొమ్ములు), ఈ సకల లోకానికి కావలసిన పోషక పదార్థాలతో నిండి ఉన్నందున, బంగారు కొండ శిఖరాలను కూడా మించి, ఐరావతం (దేవతల ఏనుగు) కుంభస్థలాలను కూడా అతిశయించి ప్రకాశిస్తున్నాయి. సకల జగత్తును పోషించే ఓ జననీ! నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!

 

శ్లోకము 14

అవిరళ గండ గళన్ మద మేదుర మత్త మతంగజరాజపతే!

త్రిభువన భూషణభూత కళానిధి రూప పయోనిధిరాజసుతే!

అయి! సుదతీజన లాలస మానస మోహన మన్మథరాజసుతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అవిరళ గండ గళన్ మద మేదుర మత్త మతంగజరాజపతే: ఎడతెగకుండా చెక్కిళ్ళ నుండి కారే మదజలంతో తడిసి, పొంగిపోయిన మదించిన ఏనుగుల సమూహానికి అధిపతిగా ఉండేదానా!
  • త్రిభువన భూషణభూత కళానిధి: మూడు లోకాలకు అలంకారమైన సంపదలకు నిధివి,
  • రూప పయోనిధిరాజసుతే: క్షీరసాగరపు కుమార్తె అయిన లక్ష్మీదేవివి నువ్వే!
  • అయి! సుదతీజన లాలస మానస మోహన మన్మథరాజసుతే: ఓ తల్లీ! స్త్రీల మనస్సులను, లేదా స్త్రీల పట్ల కోరిక గల పురుషుల మనస్సులను మోహింపజేసే మన్మథుడికి తల్లివి నువ్వే!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

ఓ పర్వతరాజు కుమార్తె! నీకు విజయం కలుగుగాక! అందమైన జటాజూటంతో మెరిసే ఓ దేవీ! నీకు విజయం కలుగుగాక! మహిషాసురుడిని సంహరించిన తల్లీ! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! నువ్వు ఒకప్పుడు, ఎడతెగకుండా మదజలధారలు కారుతూ, ఆ మదజలంతో చెక్కిళ్ళు అట్టలు కట్టిన మదించిన గొప్ప ఏనుగుపై సవారీ చేస్తూ ఉంటావు. నీ సాటిలేని ఐశ్వర్యానికి మా విజయ నినాదాలు అర్పిస్తున్నాము!

జగన్మాతా! మూడు లోకాలను అలంకరించే సకల సంపదలకు నువ్వే నిధివి. పాలసముద్రపు కుమార్తె అయిన శ్రీలక్ష్మివి కూడా నువ్వే. ఓ జననీ! నీకు విజయం కలుగుగాక!

దేవీ! అందమైన స్త్రీల మనస్సులను, అలాగే స్త్రీల పట్ల కోరిక గల పురుషుల మనస్సులను కూడా మోహంలో ముంచగలిగే మన్మథుడు నీ కుమారుడే. ఓ మన్మథుడి తల్లి! నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!


శ్లోకము 15

సుర లలనా తత “ధేయి తధేయి త” తాళనిమిత్తజ లాస్యరతే!

హసన విలాస విలాస్యమయి! ప్రణతార్త జనే...తిప్రేమధరే!

ధిమికిత ధిక్కట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాద రతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • సుర లలనా తత "ధేయి తధేయి త" తాళనిమిత్తజ లాస్యరతే: దేవతా స్త్రీలు వేసే "ధేయి తధేయి త" అనే తాళానికి తగినట్లుగా పుట్టిన లాస్య నృత్యంలో ఆనందించేదానా!
  • హసన విలాస విలాస్యమయి: హాస్యంతో కూడిన విలాసాలతో, ప్రత్యేకమైన నృత్యకళే రూపంగా గలదానా!
  • ప్రణతార్త జనేతిప్రేమధరే: నమస్కరించిన కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నదానా!
  • ధిమికిత ధిక్కట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాద రతే: "ధిమికిత ధిక్కట ధింధిమిత" అనే ధ్వనితో బలంగా మోగే మృదంగ శబ్దాలను ఇష్టపడేదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అందమైన జటాజూటంతో మెరిసేదానా! పర్వతరాజు కుమార్తె! మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! దేవతా స్త్రీలందరూ కలిసి "ధేయ్ థేయ్ తథేయ్ థేయ్" అంటూ వేసే విస్తృతమైన తాళానికి అనుగుణంగా సాగే లాస్య నృత్యంలో నువ్వు ఆనందిస్తావు. ఓ నృత్యప్రియురాలా! నీకు విజయం కలుగుగాక!

హాస్యంతో కూడిన విలాసాలతో, విశేషమైన లాస్యమే రూపంగా గల నువ్వు, గొప్ప ఆపదల్లో చిక్కుకొని విలవిలలాడుతూ నిన్ను శరణు కోరిన వారి పట్ల అంతులేని ప్రేమను కురిపిస్తావు. వారిని రక్షించి కాపాడతావు. కష్టాల్లో ఉన్నవారిని రక్షించడంలో నిష్ణాతురాలైన నీకు విజయం కలుగుగాక!

"ధిమికిట - ధిక్కట - ధిం ధిం త" అంటూ బలంగా మోగే మృదంగ ధ్వనులను విని ఆనందించే ఓ తల్లీ! నువ్వు ఎల్లప్పుడూ అన్ని విజయాలతో విలసిల్లుదువుగాక!


శ్లోకము 16

మహిత మహాహవ మల్ల మతల్లిక 'మల్లిత తల్లక మల్లరతే!

విరచిత 'వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక ఝిల్లిక వర్గ భృతే!

సీత కృత ఫుల్ల సముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • మహిత మహాహవ మల్ల మతల్లిక: గొప్పదైన, పెద్ద యుద్ధాలలో మల్లయుద్ధంలో శ్రేష్ఠులైన వీరులతో
  • 'మల్లిత తల్లక' మల్లరతే: 'మల్లిత' మరియు 'తల్లక' అనే పేరుగల మల్లయుద్ధ క్రీడలను ఆడేదానా! (అంటే, మల్లయుద్ధంలో పాల్గొనడం ఇష్టపడేదానా.)
  • విరచిత 'వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక ఝిల్లిక' వర్గ భృతే: 'వల్లిక', 'పల్లిక', 'మల్లిక', 'ఝిల్లిక' వంటి అనేక మల్లక్రీడా ప్రత్యేకతలను ప్రదర్శించేదానా!
  • సీత కృత ఫుల్ల సముల్లసిత అరుణ పల్లవ తల్లజ సల్లలితే: తెల్లగా మారిన (విరిగిన), పూర్తిగా వికసించిన, బాగా ప్రకాశించే ఎర్రటి చిగురాకుల వలె అత్యంత అందమైనదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

మహిషాసురుడిని సంహరించిన ఓ తల్లీ! నీకు విజయం కలుగుగాక!

మల్లయుద్ధంలో గొప్పవారైన వీరులతో (శుంభ, నిశుంభుల వంటి వారితో) నువ్వు వివిధ మల్లయుద్ధ క్రీడలను ఆడుతూ ఆనందించేదానా! స్వయంగా అనేక ప్రసిద్ధ మల్లవిద్యల పద్ధతులను ప్రదర్శిస్తూ ప్రకాశించే ఓ జననీ! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! నువ్వు 'తెల్లదనం కలిసిన' అద్భుతమైన ఎర్రటి చిగురాకుల కాంతితో ప్రకాశిస్తావు. (అంటే, దేవి శరీర కాంతి తెల్లదనం కలిసిన ఎరుపు రంగులో ఉంటుందని అర్థం). ఓ అమ్మా! నీకు విజయం కలుగుగాక!

 

శ్లోకము 17

భజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైక నుతే!

కృత సురతారక సంగర తారక సాగర తారక సూనునుతే!

గజముఖ షణ్ముఖ రాజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అయి: ఓ తల్లి!
  • భజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైక నుతే: వేల చేతులు గల కార్తవీర్యుడు, బాణాసురుడు, వేయి కిరణాలు గల సూర్యుడు వంటి గొప్పవారు నిన్ను సేవించి, కీర్తించారు.
  • కృత సురతారక సంగర తారక సాగర తారక సూనునుతే: దేవతలను రక్షించే యుద్ధంలో పాల్గొని, తారకాసురుడనే సముద్రాన్ని దాటించిన (సంహరించిన) కుమారుడు (కుమారస్వామి) చేత కీర్తించబడినదానా!
  • గజముఖ షణ్ముఖ రాజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే: ఏనుగు ముఖం గల గణపతి, ఆరు ముఖాలు గల కుమారస్వామి ఇరువైపులా ఉండగా ప్రకాశించేదానా, మరియు ఆనందంతో వికసించిన హృదయ పమద్మం గలదానా!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అమ్మా! నువ్వు పర్వతరాజు కుమార్తెవి, అందమైన జటాజూటం గలదానా, మహిషాసురుడిని సంహరించినదానా! నీకు విజయం కలుగుగాక!

తల్లీ! వేల చేతులు గల కార్తవీర్యుడు, బాణాసురుడు, అలాగే వేయి కిరణాలు గల సూర్యుడు వంటి గొప్ప వీరులు నిన్ను సేవించి, కీర్తించడం వల్లనే అంత గొప్పవారయ్యారు. అంతేకాదు, నీ కుమారుడైన కుమారస్వామి కూడా నిన్ను కీర్తించడం వల్లనే దేవతలను రక్షించే యుద్ధంలో విజయం సాధించి, తారకాసురుడనే భయంకరమైన సముద్రాన్ని దాటగలిగాడు (అంటే తారకాసురుడిని సంహరించాడు).

ఒక వైపు ఏనుగు ముఖం గల కుమారుడు (వినాయకుడు), మరొక వైపు ఆరు ముఖాలు గల కుమారుడు (కుమారస్వామి) కూర్చుని ఉండగా, వారి మధ్య ఆనందంతో నిండిన మనస్సుతో జగత్తును రక్షించే తల్లివి నువ్వే. నీకు ఎల్లప్పుడూ విజయ పరంపరలు కలుగుగాక!


శ్లోకము 18

పదకమలం కరుణానిలయే వరివస్యతి యో ను దినం స శివే!

అయి కమలే కమలానిలయే కమలానిలయ స్స కథం న భవేత్!

తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • కరుణానిలయే: దయకు నిలయమైన ఓ తల్లీ!
  • అయి కమలే: ఓ పరబ్రహ్మ పట్టపురాణి! (బ్రహ్మను అలంకరించేది, అంటే బ్రహ్మశక్తివి.)
  • శివే: ఓ సర్వ మంగళకారిణీ!
  • యః: ఎవడైతే
  • అనుదినమ్: ప్రతిరోజూ
  • పదకమలమ్: నీ పాదపద్మాలను
  • వరివస్యతి: సేవిస్తాడో (పూజిస్తాడో)
  • సః: వాడు
  • కథమ్: ఎలా
  • కమలానిలయః న భవేత్: సంపదలకు నిలయం కాకుండా పోతాడు? (అంటే, తప్పకుండా సంపదలు పొందుతాడు అని అర్థం.)
  • తవ పదం ఏవ: నీ పాదమే
  • పరం పదం ఇతి: అత్యున్నత స్థానమని (మోక్షమని)
  • అనుశీలయతః: గాఢంగా నమ్ముతున్న (ధ్యానిస్తున్న)
  • మమ: నాకు
  • కిం న: లోటు ఏమిటి? (అన్ని శుభాలు కలుగుతాయని అర్థం.)
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడంలో నేర్పరివైన ఓ తల్లీ! పర్వతరాజు కుమార్తె! అందమైన జటాజూటంతో మెరిసేదానా! నీకు విజయం కలుగుగాక!

ఓ కరుణకు నిలయమైన తల్లి! ఓ పరబ్రహ్మ పట్టపురాణి! ఓ సర్వ శుభాలను కలిగించే దేవీ! నిత్యం నీ పాదపద్మాలను ఆరాధించేవాడు సకల సంపదలతో విలసిల్లక ఎలా ఉంటాడు? (అంటే, తప్పకుండా సంపదలు పొందుతాడు.)

తల్లీ! నీ పాదమే అత్యున్నతమైన స్థానం (పరమపదం, మోక్షం) అని దృఢంగా నమ్ముతున్న నాకు లోటు అనేది ఏమీ లేదు! (నాకు అన్ని శుభాలు కలుగుతాయి, ఏ కోరికలూ తీరకుండా ఉండవు.)

ఓ దేవీ! నువ్వు ఎల్లప్పుడూ విజయాలతో ప్రకాశించుదువుగాక!


శ్లోకము 19

కనక లసత్ కలశాబ్ది జలై రనుసించినుతే గుణరంగభువం!

భజతి స కిం న శచీ కుచకుంభతటీ పరిరంభ సుఖమ్!

తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

  • కనక లసత్ కలశాబ్ది జలైః: బంగారం వలె మెరిసే కలశంలోని సముద్ర (లేదా సరస్సు) జలాలతో
  • అనుసించినుతే: నిరంతరం అభిషేకిస్తాడో (పూజిస్తాడో)
  • గుణరంగభువం: సత్వ, రజో, తమో గుణాలకు రంగస్థలం వంటి నిన్ను (మూడు గుణాలకు అధిపతివి నువ్వే)
  • భజతి స కిం న శచీ కుచకుంభతటీ పరిరంభ సుఖమ్: వాడు శచీదేవి (ఇంద్రుని భార్య) రొమ్ముల వంటి కుండల పక్క భాగాలను కౌగిలించుకునే సుఖాన్ని ఎందుకు పొందడు? (అంటే, తప్పకుండా పొందుతాడు, ఇంద్రునితో సమానమైన సుఖాన్ని పొందుతాడు అని అర్థం.)
  • తవ చరణం శరణం కరవాణి: నీ పాదాలను శరణు వేడుతున్నాను.
  • నతామరవాణి నివాసి శివే: నమస్కరించిన దేవతల మాటలలో నివసించే ఓ శుభకారిణీ!
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

మహిషాసురుడిని సంహరించడంలో సమర్థురాలైన ఓ తల్లీ! పర్వతరాజు కుమార్తె! అందమైన జటాజూటంతో మెరిసేదానా! నీకు విజయం కలుగుగాక!

ఓ కరుణకు నిలయమైన తల్లి! స్వచ్ఛమైన సరస్సుల (లేదా సముద్రపు) నీటిని బంగారు పాత్రలతో తీసుకువచ్చి, మూడు గుణాలకు (సత్వం, రజస్సు, తమస్సు) అధిపతివైన నిన్ను ప్రతిరోజూ అభిషేకించి ఆనందించే భక్తుడు, ఇంద్రుడికి లభించే సుఖాన్ని పొందడంలో ఆశ్చర్యం ఏముంది? (తప్పకుండా పొందుతాడు).

తల్లీ! నీకు నమస్కరించే దేవతల మాటలలో కూడా నువ్వే నివసిస్తున్నావు. ఓ దేవీ! నేను నిన్ను శరణు వేడుతున్నాను. పర్వతరాజు కుమార్తె! నీకు విజయం కలుగుగాక!

 

శ్లోకము 20

తవ వదనేందు మలం విమలేందుకలా సకలం ననుకూలయతే!

కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీభి రసౌ విముఖీక్రియతే!

మమ తు మతం శివనామధనే భవతీకృపయా కిముతత్రియతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • సకలమ్: కాంతితో నిండిన
  • తవ వదనేందుమ్: నీ ముఖమనే చంద్రుడిని
  • విమలేందుకలా: స్వచ్ఛమైన చంద్రకళ
  • అలమ్ కూలయతే నను: ఎక్కువగా ఆశ్రయించుకొని ఉంది కదా! (అంటే, నీ ముఖ సౌందర్యానికి చంద్రకళ తోడైందని అర్థం.)
  • కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీభిః: ఇంద్రుడి నగరంలోని చంద్రముఖులు, అందమైన ముఖాలు గల దేవతా స్త్రీలచేత
  • అసౌ విముఖీక్రియతే: ఈ చంద్రుడు ఓడిపోయాడా ఏమిటి? (అంటే, వారి అందం ముందు చంద్రుడు నిలబడలేక నీ ముఖాన్ని ఆశ్రయించాడా?)
  • మమ తు మతం: నా అభిప్రాయం అయితే
  • శివనామధనే: శివుని నామమే ధనంగా గలవాడి యందు (శివభక్తుని యందు)
  • భవతీకృపయా: నీ దయతో
  • కిముతత్రియతే: అలా జరుగుతుంది ఏమో! (అంటే, చంద్రుడు శివభక్తుడు కాబట్టి నీ దయ వల్లనే నీ ముఖాన్ని ఆశ్రయించాడు అని.)
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

అమ్మా! నీకు విజయం కలుగుగాక! పర్వతరాజు కుమార్తె! అందమైన జటాజూటంతో ప్రకాశించేదానా! మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ!

చంద్రుడు, తన కళలతో నిండి, నీ ముఖమనే చంద్రుడిని పూర్తిగా ఆశ్రయించి ఉన్నాడు కదా! దీనికి కారణం, ఇంద్రుడి నగరంలోని దేవతా స్త్రీల ముఖ సౌందర్యం ముందు చంద్రుడు ఓడిపోయి, నీ ముఖాన్ని ఆశ్రయించాడా?

నా అభిప్రాయం ప్రకారం అది కాదు! శివుని నామాన్ని తన ధనంగా భావించే వారి పట్ల (శివభక్తుల పట్ల) నీ దయ చాలా గొప్పది. ఆ చంద్రుడు శివభక్తుడు కాబట్టే, నీ అపారమైన దయ వల్లనే నీ ముఖ సౌందర్యాన్ని ఆశ్రయించి ఉన్నాడని నేను భావిస్తున్నాను.

ఓ జననీ! నీకు విజయం కలుగుగాక!

 

శ్లోకము 21

అయి మయి దీనదయాళుతయా కృపయైకతయా భవితవ్య ముమే!

అయి జగతో జననీ కృపయో.సి యథాసి తథాను గతానురతే!

యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురతాప మపాకురుతే!

జయ జయ హే మహిషాసురమర్దిని, రమ్యకపర్దిని, శైలసుతే!

ప్రతి పదార్థ వివరణ

  • అయి ఉమే: ఓ ఉమాదేవీ!
  • మయి దీనదయాళుతయా కృపయైకతయా భవితవ్యమ్: దీనుల పట్ల దయ చూపడం నీ ధర్మం కాబట్టి, నా పట్ల నువ్వు దయతోనే ఉండాలి.
  • అయి జగతో జననీ: ఓ జగత్తుకు తల్లీ!
  • కృపయా యథాసి తథా అనుగతానురతే: శరణు వేడిన వారి పట్ల దయతో ఎలా ఉన్నావో, అలాగే దయతో ఉంటావు. (నీ దయా స్వభావంలో మార్పు లేదు.)
  • యదుచిత మత్ర భవతీ ఉరరీ కురుతాత్: నా విషయంలో ఏది తగినదో, దాన్ని నువ్వు గొప్పగా నెరవేర్చుదువుగాక.
  • రుతాప మపాకురుతే: గొప్పదైన (సంసార) దుఃఖాన్ని తొలగిస్తావు.
  • జయ జయ హే మహిషాసురమర్దిని: మహిషాసురుడిని సంహరించిన ఓ దేవీ, నీకు విజయం కలుగుగాక! విజయం కలుగుగాక!
  • రమ్యకపర్దిని: అందమైన కపర్ద (జటాజూటం) గలదానా!
  • శైలసుతే: పర్వతరాజు కుమార్తె అయిన ఓ పార్వతీ!

తాత్పర్యం

ఓ పర్వతరాజు కుమార్తె! అందమైన జటాజూటంతో మెరిసేదానా! మహిషాసురుడి ప్రాణాలను తీయడంలో సమర్థురాలైన ఓ దల్లీ! నీకు విజయం కలుగుగాక!

ఓ ఉమాదేవీ! దీనుల పట్ల దయ చూపడం నీ స్వభావం. నాకంటే దీనుడు మరొకరు లేరు. ఓ జగన్మాతా! నువ్వు శరణు వేడిన వారిని రక్షించేదానవు. కాబట్టి, నువ్వు నా పట్ల దయతోనే చూడాలి. (లేదంటే నీ దయాగుణమే లోపిస్తుంది!)

సంసార దుఃఖాలన్నింటినీ తొలగించే ఓ తల్లీ! నా విషయంలో ఏది తగినదో, అది అంతా నాకు సంపూర్ణంగా అనుగ్రహించి దయ చూపాలి.


శ్లోకము 22

స్తుతి మితి స్తిమితస్తు సమాధినా నియమితోయమితో సుదినం పఠేత్!

పరమయా రమయా సతు సేవ్యతే పరిజనోపి జనోపి చ తం భజేత్!

ప్రతి పదార్థ వివరణ

  • ఇతి స్తుతిమ్: ఈ స్తోత్రాన్ని
  • సమాధినా స్తిమితస్తు: మంచి ఏకాగ్రతతో, మనసును కదలకుండా ఉంచి
  • నియమితో యమితో: నియమాలను పాటిస్తూ, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని
  • సుదినం పఠేత్: ప్రతిరోజూ, మంచి రోజుగా భావించి చదువుతాడో
  • పరమయా రమయా సతు సేవ్యతే: వాడు గొప్ప సంపదచే సేవింపబడతాడు (అంటే, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు).
  • పరిజనోపి జనోపి చ తం భజేత్: సేవకులు, ఇతరులు కూడా అతనిని సేవిస్తారు (అతనిని గౌరవిస్తారు).

తాత్పర్యం

ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, నియమాలను పాటిస్తూ, మనసును ఏకాగ్రంగా నిలిపి, ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణం చేసేవాడు సకల సంపదలతో నిండినవాడై, ఎంతో మంది సేవకులను పొంది, గొప్పగా విలసిల్లుతాడు. అతడు అందరిచేతా గౌరవింపబడే వ్యక్తిగా ప్రకాశిస్తాడు.


శ్లోకము 23

రమయతి కిల కర్ష న్నేష చిత్తం నరాణా-మపరజపర మస్మాద్ రామకృష్ణః కవీనామ్!

అకృత సుకృత గమ్యం రమ్య పద్యైక హర్మ్యం స్తవన మవనహేతుం ప్రీతయే విశ్వమాతుః!

ప్రతి పదార్థ వివరణ

  • కవీనాం: కవులలో
  • ఏషః రామకృష్ణః: ఈ రామకృష్ణుడు
  • నరాణాం చిత్తమ్: మానవుల మనసులను
  • అపరజ పరమ్: రజోగుణం (ఆరాటం, కోరికలు) లేని తేజస్సు (అంటే శుద్ధ సత్వం, దైవికత్వం) పట్ల
  • కర్షన్: ఆకర్షిస్తూ
  • రమయతి కిల: ఆనందపరుస్తున్నాడు కదా!
  • అస్మాత్: దీని వల్ల
  • విశ్వమాతుః: జగన్మాత యొక్క
  • ప్రీతయే: అనుగ్రహం కోసం
  • అవనహేతుమ్: రక్షణకు కారణమైన
  • స్తవనమ్: ఈ స్తోత్రాన్ని
  • సుకృత గమ్యమ్: గొప్ప పుణ్యం ఉంటేనే పొందగలిగేదిగా
  • రమ్య పద్యైక హర్మ్యమ్: అందమైన పద్యాలే ప్రధానమైన ప్రాసాదం (భవనం) గా గలదిగా
  • ఆకృత: రచించాడు (నిర్మించాడు).

తాత్పర్యం

మనుషుల మనసులు సాధారణంగా ప్రపంచ విషయాల వైపు, కోరికల వైపు పరుగెత్తుతూ ఉంటాయి. అయితే, ఈ రామకృష్ణ కవి అటువంటి మనసులను తన కవిత్వంతో ఆకర్షించి, వాటిని రజోగుణం (అంటే కోరికలు, వ్యామోహాలు) లేని దైవశక్తి వైపు మళ్ళించి, అక్కడ ఆనందాన్ని పొందేలా చేస్తున్నాడు.

జగన్మాత యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఎన్నో పుణ్యాలు చేసుకున్న సాధకులకు మాత్రమే లభించే, ఆత్మ రక్షణకు కారణమైన ఈ స్తోత్రాన్ని ఆయన రచించాడు. ఈ స్తోత్రం అందమైన పద్యాలతో నిర్మించబడిన ఒక గొప్ప భవనం (ప్రాసాదం) వంటిది.


వివరణ

మానవుల మనసులు సాధారణంగా ఐదు పొరలు (కోశాలు) కలిగి ఉంటాయి: అన్నమయం (శరీరం), ప్రాణమయం (ప్రాణం), మనోమయం (మనసు), బుద్ధిమయం (బుద్ధి), ఆనందమయం (ఆనందం). సామాన్యులు అన్నమయ కోశంలోనే ఆనందం పొందుతారు. కవులు మనోమయ కోశంలో సృజిస్తారు.

కానీ ఈ రామకృష్ణ కవి అలాంటి సాధారణ కవి కాదు. ఆయన కవిత్వం మనస్సులను లోకం వైపు పరుగులెత్తించకుండా, వాటి వేగాన్ని అరికట్టి, రజోగుణాన్ని దాటి, స్వచ్ఛమైన సత్వగుణం ఉన్న చోటికి (అంటే దైవం వైపునకు) మళ్ళించగల శక్తిని కలిగి ఉంది.

భౌతిక విషయాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా, ఈ కవి రచించిన స్తోత్రంలోని అందమైన కవిత్వ శిల్పం అమ్మవారి పాదాల వైపు ఆకర్షించి, అక్కడ ఆనందం పొందేలా చేస్తుంది. అనేక మంచి పనులు (సుకృతాలు) చేసినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానానికి, రక్షణకు ఉపయోగపడే ఇటువంటి స్తోత్రం లభిస్తుందని కవి స్వయంగా చెప్పాడు. ఇది కేవలం ఒక స్తోత్రం కాదు, అందమైన పద్యాలతో నిర్మించిన ఒక పవిత్ర భవనం.


శ్లోకము 24

శ్లో॥ ఇందురమ్యో మహ ర్బిందురమ్యో ముహు-ర్బిందు రమ్యో యతః సానవద్యం స్మృతః!

శ్రీపతేః సూనునా కారిత స్సో ధునా విశ్వమాతుః పదే పద్య పుష్పాంజలిః!

ప్రతి పదార్థ వివరణ

  • ఇందురమ్యః: చంద్రునిచే అందమైన (చంద్రకళతో శోభిల్లే)
  • మహః: తేజస్సు (కాంతి)
  • ముహుర్బిందురమ్యః: మాటిమాటికి బిందువుచే అందమైనది (బిందురూపంలో కూడా అందంగా ఉండేది)
  • బిందు రమ్యః యతః: బిందువుచే అందంగా ఉన్న తేజస్సు ఎందుకంటే (దేవి ద్వారా)
  • సానవద్యం స్మృతః: నిందించడానికి వీలులేనిదిగా (లోపం లేనిదిగా) స్మరించబడిందో (గుర్తుచేసుకోబడిందో)
  • శ్రీపతేః సూనునా: శ్రీపతి (విష్ణువు) కుమారుడిచే (రామకృష్ణ కవిచే)
  • కారితః సః అధునా: ఆ (శ్లోక కుసుమాంజలి) ఇప్పుడు చేయబడింది (రచించబడింది)
  • విశ్వమాతుః పదే పద్య పుష్పాంజలిః: జగన్మాత పాదాలకు శ్లోకాలనే పూల అంజలిగా అర్పించబడింది.

 

తాత్పర్యం

ఈ పద్యాలలో, చంద్రుడిచే అందమైన, బిందువులచే మాటిమాటికి అందమైన, మరియు బిందువుచే అద్భుతంగా ఉన్న దేవి తేజస్సు, ఏ లోపమూ లేకుండా గొప్పగా గుర్తుచేసుకోబడింది. శ్రీపతి కుమారుడైన రామకృష్ణ కవి, తాను రచించిన ఈ శ్లోకాలనే పూల అంజలిని జగన్మాత శ్రీ చరణాలకు అర్పించుచున్నాడు.


పరమేశ్వరి శిరస్సుపై చంద్రరేఖ ఉండటం వల్ల ఆమె "ఇందురమ్య". ఆమెను చేరడానికి ఉన్న విద్యను "చంద్రకళా విద్య" అని పిలుస్తారు. కుండలినీ శక్తిని సహస్రారం వరకు జాగృతం చేయగలిగిన సాధకులకు, పరమేశ్వరి సహస్రారంలో పూర్ణచంద్ర బింబంలా కనిపిస్తుంది. అందువల్ల కూడా ఆమె "ఇందురమ్య".

శ్రీచక్రంలో "బిందువు" శివుడిని సూచిస్తుంది. పరమేశ్వరి శివుడిని ఆసనంగా చేసుకుని ఉంటుంది కాబట్టి, ఆమె "బిందురమ్య". మంత్ర శాస్త్రంలో "బిందువు శివుడు, రెండు బిందువులు (విసర్గం) పరమేశ్వరి" అని చెబుతారు. "విసర్గం" అంటే సృష్టి, విడుదల. బిందువు స్థితిని సూచిస్తే, విసర్గం లేదా త్రికోణం గతిని (కదలికను) సూచిస్తాయి. దేవి బిందువు ద్వారా మాటిమాటికి సృష్టి చేస్తుంది కాబట్టి ఆమె "ముహుర్బిందురమ్య".

ఇటువంటి పరమేశ్వరిని ఈ స్తోత్రంలో లోపం లేకుండా స్మరించడం జరిగింది. రామకృష్ణ కవి, తాను రచించిన ఈ పద్యాలనే పూల అంజలిని జగన్మాత పాదాలకు సమర్పించానని చెప్పుకున్నాడు. అంటే, ఈ స్తోత్రంలోని ప్రతి పద్యం కూడా అమ్మవారి పాదాల సువాసనలతో నిండి ఉంటుంది అని దీని అర్థం. ఇది నిజం! ఈ స్తోత్రాన్ని హృదయంలో నిలుపుకోండి. అమ్మవారి పాదాల సుగంధాలైన సుఖశాంతులు, ప్రశాంతత, ఆనందం, మరియు ఆత్మవైపు ప్రవృత్తి మీలో నిండుగా వెల్లివిరుస్తాయని గ్రహించండి.


                          శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రము   సంపూర్ణమయినది.

No comments:

Post a Comment

శ్రీ హనుమత్కవచ స్తోత్రం ( అర్థ తాత్పర్యాలతో )

శ్రీ హనుమత్కవచ స్తోత్రం (  అర్థ తాత్పర్యాలతో ) ప్రారంభ శ్లోకం శ్లోకం: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్...