శ్రీ అప్పయ్య దీక్షితులు రచించిన మహిమాన్వితమైన శివ మార్గ బంధు స్తోత్రం – తెలుగు తాత్పర్యంతో
డా. తాడేపల్లి పతంజలి 01.03-22
( మహాశివరాత్రి సందర్భంగా శివ పాదపద్మములకు సమర్పితము)
1.
शंभो महादेव देव शिव शंभो महादेव देवेश शंभो
शंभो महादेव देव
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
తాత్పర్యము
శుభాన్ని అనుగ్రహించే శివ స్వామికి సాష్టాంగ ప్రణామాలు,
గొప్ప దేవునికి సాష్టాంగ ప్రణామాలు,
శాంతి నిలయునికి సాష్టాంగ ప్రణామాలు,
మనకు సంపదలను అనుగ్రహించే శివునికి(అమంగళమును పోగొట్టువాడు) సాష్టాంగ ప్రణామాలు,
మరియు దేవతల దేవుడు అయిన శివునికి సాష్టాంగ ప్రణామాలు.
2
फालावनम्रकिरीटं फालनेत्रार्चिषा दग्ध पञ्चेषुकीटम्।
शूलाहतारातिकूटं शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धुम्॥ .. शंभो…
ఫాలావనమ్ర కిరీటం
ఫాలనేత్రార్చిషాదగ్ధపంచేషుకీటమ్
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం
భజే మార్గబంధుమ్
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
తలపై కిరీటం ధరించినవానిని ( ఫాల +అవనమ్ర కిరీటం 1. ఫాల= నెత్తి, 2. అవనమ్ర= ఆదరించిన, నమ్రమయినట్లున్న ) తన నుదుటి లోని నేత్రపు మంటతో ఐదు బాణాలు కల మన్మథుని కాల్చిన వానిని,( 1. ఫాల= నుదురు ,2. పంచేషు = పంచ ఇషవః యస్య ఐదు బాణములు కలవాడు. మన్మథుడు 3. కీటం= కీటమువంటి మన్మథుని భక్షించినవానిని ).
తన త్రిశూలము చేత శత్రువులను చంపినవానిని,( శూల+ఆహత+ఆరాతికూటం)
మాయారహితుడును, (శుద్ధం)
అమృతాన్ని కురిపించే నెలవంకను ముందుజుట్టునందు కలవాడును,
నా మార్గ బంధువయిన శివుని ప్రార్థిస్తున్నాను.
3
अङ्गे विराजद्भुजङ्गं अभ्र गंगा तरंगाभि रामोत्तमांगम्।
ओंकारवाटी कुरंग सिद्ध संसेवितांघ्रिं भजे मार्गबन्धुम् ॥ .. शंभो…
అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
పాములచే అలంకరించబడిన అవయవాలు కలవానిని
ఆకాశగంగా తరంగాలతో అందంగా ఉన్న తల కలవానిని
పవిత్ర ఓంకార ఉద్యానవనంలో జింక అయినవానిని,
గొప్ప ఋషులు సిద్ధులు పూజించు పాదాలు కలవానిని
నా మార్గ బంధువయిన శివుని ప్రార్థిస్తున్నాను.
4
नित्यं चिदानंदरूपं निह्ताशेष लोकेश वैरिप्रतापम् ।
कार्तस्वरागेन्द्र चापं कृत्तिवासं भजे दिव्य सन्मार्गबन्धुम्॥ .. शंभो…
నిత్యం
చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశ వైరిప్రతాపమ్ |
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం
భజే దివ్యసన్మార్గబంధుమ్ || 4 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
శాశ్వతుని, జ్ఞానము మరియు ఆనందం తన రూపంగా కలవానిని
ఇంద్రుని శత్రువు యొక్క కీర్తిని నాశనం చేసినవానిని (నిహ్నుత+అశేషలోక+ఈశ వైరిప్రతాపమ్ 1. నిహ్నుత =తిరస్కరించిన)
బంగారు మేరు పర్వతాన్ని తన ధనుస్సుగా ఉపయోగించినవానిని,( కార్తస్వర+అగ+ఇంద్రచాపం 1. కార్తస్వర= కృతస్వర అనబడు గనిలో పుట్టినది. బంగారము.2. అగ= వెళ్లలేనిది ,పర్వతము
చర్మమే వస్త్రముగా కలవానిని
దివ్యమైన ఉత్తమ మార్గానికి చెందిన వారికి బంధువయిన శివుని నేను ప్రార్థిస్తున్నాను,
5
कन्दर्प दर्पघ्नमीशं कालकण्ठं महेशं महाव्योमकेशम्।
कुन्दाभदन्तं सुरेशं कोटिसूर्यप्रकाशं भजे मार्गबन्धुम् ॥ .. शंभो…
కందర్పదర్ప దఘ్నమీశం
కాలకంఠం మహేశం
మహావ్యోమకేశమ్ |
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం
భజే మార్గబంధుమ్
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
మన్మథుని గర్వాన్ని నాశనం చేసినవానిని,(పోగొట్టినవానిని)
కాలకూటము వలన నల్లనయిన కంఠము గల శివుని
గొప్పదయిన ఆకాశము తన కేశములుగా ( జటాజూటం) కలవానిని
తెల్లటి మల్లె (మొల్ల) పువ్వులను పోలిన దంతాలు కలవానిని,
దేవతల ప్రభువును
కోట్లాది సూర్యుల ప్రకాశాన్ని కలిగి ఉన్నవానిని.
నా మార్గ బంధువయిన శివుని ప్రార్థిస్తున్నాను,
6
मन्दारभूतेरुदारं मन्दरागेन्द्रसारं महागौर्यदूरम्।
सिन्धूर दूर प्रचारं सिन्धुराजातिधीरं भजे मार्गबन्धुम्॥ .. शंभो…
మందారభూతేరుదారం.
మందరాగేంద్రసారం మహా గౌర్యదూరమ్ |
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
కోరికలు తీర్చే మందార వృక్షముకన్న ఎక్కువగా సంపదలు ఇవ్వగలిగినవానిని,
మందర పర్వతం వలె బలమయినవానిని ,(మందరాగ= రాగరహితులయిన విరక్తులలో, ఇంద్ర= శ్రేష్ఠులయిన వారికి సారమయిన నిధి వంటివానిని అని ఇంకొక సమన్వయం)
మహాగౌరికి ఎన్నటికి దూరము కానివానిని
కుంకుమువంటి యెఱ్ఱని పొడిని (సిందూర) దూరము చేయు ప్రచారము కలవానిని (అనగా ఒక్కొక్క సమయంలో తీవ్రమైన ఎరుపు రంగును కలిగి ఉన్నవానిని, లేదాసిందూరము కాకుండా భస్మము శరీరమున ధరించినవానిని)
( అతిధూమ్రః = మిక్కిలి ధూమ్రవర్ణము -నలుపు, ఎరుపు కలసియున్న రంగు- పొగవర్ణములో ఉన్నవాడు అని శివ సహస్రనామము)
సముద్రుని వలె మిక్కిలి గంభీరమయినవానిని
నేను నా మార్గం యొక్క స్నేహితుడిని ప్రార్థిస్తున్నాను,
7
अप्पय्ययज्वेन्द्रगीतं स्तोत्रराजं पठेद्यस्तु भक्त्या प्रयाणे।
तस्यार्थसिदिं विधत्ते मार्गमध्येऽभयं चाशुतोषी महेशः॥ .. शंभो…
అప్పయ్యయజ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్ధసిద్ధిం విధత్తే
మార్గమధ్యే భయం చాశుతోషో మహేశః
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ
శ్రేష్ఠులయిన అప్పయ్య దీక్షితుల గీతము(స్తోత్రము) ఇది..
ఈ స్తోత్రము ప్రయాణంలో భక్తితో చదివిన వారి కోరికలను నెరవేరుస్తుంది.
ప్రయాణ సమయంలో ఈ స్తోత్రమును చదివినవారి రక్షణను, కార్యసిద్ధిని అల్పసంతోషి (శీఘ్ర సంతోషి) అయిన శివుడు సులభంగా కలిగిస్తాడు.
***
( ఆర్తిగా ఈ స్తోత్రాన్ని చదివే మా మామగారు కీర్తిశేషులు శ్రీ పి. సత్యసాగర్ గారిని ఈ సందర్భంలో స్మరిస్తూ నమస్కరిస్తున్నాను)
- తాడేపల్లి పతంజలి
స్వస్తి
No comments:
Post a Comment